NVIDIA's Blue Robot: 'బ్లూ' రోబోట్ ఆవిష్కరణ.! కొత్త యుగానికి.. కొత్త నాంది.! 12 d ago

మార్చ్ 19న (మంగళవారం) జరిగిన Nvidia GTC 2025 AI సమావేశంలో సీఈఓ జెన్సెన్ హువాంగ్ (Jensen Huang) సంచలనం సృష్టించారు. ఈ సమావేశంలో 'బ్లూ' అనే AI-ఆధారిత రోబోట్‌ను పరిచయం చేశారు. డిస్నీ రీసెర్చ్, గూగుల్ డీప్‌మైండ్ సహకారంతో ఈ రోబోట్ ను రూపొందించారని హువాంగ్ తెలిపారు. స్టార్ వార్స్-ప్రేరేపిత ఈ రోబోట్ వేదికపైకి నడిచి.. కార్యక్రమంలో హువాంగ్‌తో సంభాషించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
"హాయ్ బ్లూ!" అని హువాంగ్ పలకరించగా.. రోబోట్ ప్రతిస్పందించింది. ప్రేక్షకుల వైపు తిరిగి, ఇది పూర్తి రియల్-టైమ్ సిమ్యులేషన్ అని.. భవిష్యత్తులో రోబోట్‌లకు ఇలాగే శిక్షణ ఇవ్వనున్నామని ఆయన తెలిపారు. బ్లూ లోపల రెండు Nvidia కంప్యూటర్లు ఉన్నాయని ఆయన వెల్లడించారు.
ప్రపంచవ్యాప్తంగా కార్మికుల కొరతకు పరిష్కారంగా.. రోబోటిక్స్‌ను వాడడం ఉత్తమమని హువాంగ్ సమర్థించారు. ఈ దశాబ్దం చివరి నాటికి ప్రపంచంలో కనీసం 5 కోట్ల మంది కార్మికుల కొరత ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బ్లూ వంటి ఏఐ రోబోట్‌లు కార్మికుల కొరతను తీర్చడానికి.. వివిధ రంగాలలో మానవులకు సహాయపడటానికి ఉపయోగపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
'బ్లూ' రోబోట్‌ను పరిచయం చేసిన తరువాత సీఈఓ హువాంగ్ ప్రసంగించారు. "ఇది ఎంత అద్భుతమైన సంవత్సరం.. మనకు మాట్లాడటానికి చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి. మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను.. నేను ఇక్కడ నెట్ లేకుండా ఉన్నాను... స్క్రిప్ట్‌లు, టెలిప్రాంప్టర్ లు ఇవేం లేకుండా ఇక్కడ మాట్లాడుతున్నాను. కాబట్టి ఇక ప్రారంభిద్దాం," అని హువాంగ్ ఉద్వేగభరితంగా ప్రసంగం మొదలుపెట్టారు.
ఈ ప్రసంగంలో హువాంగ్.. DGX Spark, DGX Station అనే రెండు "వ్యక్తిగత AI సూపర్ కంప్యూటర్లను" ఆవిష్కరించారు. ఇవి కంపెనీ గ్రేస్ బ్లాక్‌వెల్ ప్లాట్‌ఫామ్‌తో ఆధారితమైనవి.. డేటా సెంటర్‌కు కనెక్షన్‌తో లేదా.. కనెక్షన్ లేకుండా పెద్ద AI మోడళ్లలో పని చేయడానికి వినియోగదారులకు ఉపయోగపడతాయని ఆయన తెలిపారు.
ప్రస్తుతం వాల్ స్ట్రీట్ దృష్టి మొత్తం Nvidia తదుపరి తరం ఏఐ చిప్‌ల లాంచ్ పైప్‌లైన్‌పై ఉంది. బ్లాక్‌వెల్ నుండి బ్లాక్‌వెల్ అల్ట్రాకు మారడానికి Nvidia సన్నాహాలు ప్రారంభించింది. బ్లాక్‌వెల్‌తో పాటు.. ఎన్విడియా తన AI సూపర్‌చిప్ ప్లాట్‌ఫామ్ "రూబిన్"ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఖగోళ శాస్త్రవేత్త (Astronomer) వెరా రూబిన్ పేరునే దీనికి పెట్టారు. హువాంగ్ గత సంవత్సరం కంప్యూటెక్స్‌లో రూబిన్ ప్లాట్‌ఫామ్‌ను మొదటిసారిగా ప్రవేశపెట్టారు. దీనిని వచ్చే సంవత్సరంలో విడుదల చేస్తున్నట్లు హువాంగ్ ప్రకటించారు.
ఇలాంటి ఎన్నో ఆవిష్కరణలు ఎన్విడియాను ( Nvidia) ఏఐ రంగంలో అగ్రగామిగా నిలబెట్టాయి. భవిష్యత్తులో AI సాంకేతికత మరింత అభివృద్ధి చెంది.. మానవ జీవితంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇది చదవండి: Baidu ERNIE AI--AI పోటీలో దూసుకుపోతున్న చైనా కొత్త AI మోడళ్లు.!